Wednesday, April 28, 2010

ATAA DANCE SHOW............


పిల్లలతో శృంగార "ఆటా" భంగిమలా.........?

ఐదారేళ్ల చిన్న పిల్ల శృంగార భంగిమలు చూపిస్తుంటే ఏమనిపిస్తుంది? ఎవరైనా అదేం రోగం అనుకుంటారు. అదే టీవి చానళ్లలో రియాల్టీషోల పేరుతో చిన్నపిల్లలతో శృంగార భంగిమలు చూపితే ఏమనుకుంటారు. ఇంట్లో కూర్చొని టీవి చూసే వారు ఛీ.............అనుకుంటారు. అదే షోలో పాల్గొంటున్న ప్రేక్షకులో, న్యాయనిర్ణేతలో అయితే ఈల వేసి ప్రోత్సహిస్తారు. ఈ రెండు వర్గాలకు కాకుండా బాధ్యతాయుతంగా ఆలోచించే వారు సైతం ఉంటారని కొందరు నిరూపించారు. టీవిల్లో ఇలాంటి దిక్కుమాలిన దృశ్యాలను చూసి తిట్టుకుని చెడిపోయిన ఈ సమాజాన్ని ఎవరూ బాగుచేయలేరు అని బాధపడి ఊరుకోకుండా కొంతమంది మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు...........

జీ టీవిలో ఆట పేరుతో చిన్నపిల కోసం ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంటే మంచిదే! కానీ ఈ కార్యక్రమంలో జరుగుతున్నది అది కాదు. పచ్చి శృంగార భంగిమలను చిన్నపిల్లలు ప్రదర్శిస్తున్నారు. కామాన్ని రెచ్చగొట్టే విధంగా పిల్లలతో భంగిమలు చూపుతున్నారని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వారు టీవి చర్చల్లో విమర్శించారు. సినిమాల్లో పచ్చిపచ్చిగా ఉన్న ఐటిమ్‌సాంగ్స్‌పై పిల్లలతో వికార చేష్టలను ప్రదర్శిస్తున్నారు. దానికి పెద్దల చప్పట్లు, ఈలలు. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగానే జీలో ప్రసారం అయినా ఆట కార్యక్రమంలో పిల్లల వికార చేష్టల నృత్యం దృశ్యాన్ని టీవి 5 ప్రసారం చేసింది.........

పిల్లలతో ఇలాంటి నృత్యాలు చేయించడం ఏమిటని నిలదీసింది. ఆ తరువాత ఇదే అంశంపై సాక్షి చానల్‌లో చర్చ నిర్వహించారు. ఆ పాట ఎంత పాపులర్ అయినా అయి ఉండవచ్చు, ఐటిమ్ గర్ల్ రెచ్చగొట్టే విధంగా చేసే భంగిమల్లో పిల్లలను ఆడించవచ్చునా అని చానల్ పెద్దలు ఆలోచించాలి. తమ పిల్లలు టీవిలో కనిపిస్తే చాలు అనుకునే వారు ఇలాంటి వాటికి అంగీకరించవచ్చు, కానీ ఇలాంటి నృత్యాలను చూసిన పిల్లలపై పడే ప్రభావం ఆలోచించాలి. వికృత చేష్టలు సరైనవేననే అభిప్రాయం పిల్లల్లో ఏర్పడుతుంది. స్వీయ నియంత్రణకు చానళ్లు ఎలాగూ అంగీకరించవు. అడ్డుఅదుపు లేకుండా ఇలాంటి కార్యక్రమాలపై మానవహక్కుల సంఘం వంటి వాటికి ఫిర్యాదు చేయడం అభినందనీయం. ఇలాంటి ఫిర్యాదుల వల్లనైనా కొంచం మార్పు వస్తుంది...........

No comments: