Tuesday, October 19, 2010
మధ్యహ్నం అవ్వడం పాపం గరిట..కురదాకా తో వచ్చేస్తున్నా టీవీ చానల్స్....
వండుకుంటే ఒక్కటే కూర. మరి దండుకుంటే వంద కూరలన్నదిసామెత. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌నుండి న్యూస్ ఛానల్స్ వరకు రోజుకి రెండు రెసిపిలకు తక్కువ కాకుండా వండి
వారుస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలనుండి 2 గంటలలోపు ప్రతి చానల్‌వారు వంటా వార్పుపై దృష్టిపెట్టారు. సరిగ్గా అది భోజన సమయం అయినప్పటికీ ప్రేక్షకులు టీవీ వంటలను రుచిని చూస్తేకానీ ఇంట రుచులు లొట్టలేసే పరిస్థితి కనిపించడంలేదని తెలుస్తుంది.
ఘుమఘుమలు, వంటవార్పు, రుచి చూడు, ఏం టేస్టుగురూ! ఆహా ఏమిరుచి, కిచెన్ 65, అభిరుచి, మీ ఇంటి వంట, మా వూరి వంట, అమ్ములు ఇంట కమ్మని వంట, పాకశాల, రుచి అభిరుచి ఇలా ప్రతి చానల్‌వారు ఏదో ఒక పేరుతో మినిమమ్ అర్ధగంట కార్యక్రమం చేయడం జరుగుతోంది. సాధారణంగా వంటా వార్పు సెక్షన్ అనగానే అది ఆడవాళ్లకు సంబంధించిన కార్యక్రమం కనుక లేడీ యాంకర్లను పెట్టడం సహజం. కానీ కొన్ని చానల్స్ వారు విభిన్నంగా మేల్ యాంకర్లని పెట్టి నలభీమ పాకానికి ఏమీ తక్కువ కాదని నిరూపించారు.
స్టుడియోలో వండి వార్చడమంటే ఒకెత్తు. సాక్షాత్తు కార్యక్రమంలో పాల్గొంటాం అనేవారి ఇంటికే పోయి పొయ్యి వెలిగించడం మరో ఎత్తు. పచ్చళ్లనుండి పళ్ల రసాలవరకు, కట్‌లెట్‌లనుండి కర్రీల వరకు ఒకటేమిటి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వరకు తీసుకునే అనేక రకరకాల ఆహారపదార్ధాలను అందించడంలో పార్టిసిపెంట్స్ ఉరకలు వేస్తున్నారు. మినిమమ్ నాలుగైదు గంటలపాటు సాగే ఈ ప్రక్రియను అర్ధగంటలో అందంగా కుదించి అందించడంలో అన్ని చానల్స్ భేష్ అనిపించుకుంటున్నాయి.
మహిళలు మాత్రమే అర్హులుగా ఉండే ఈ ప్రోగ్రాంలో పురుషులకు కూడా ఇట్టే స్థానం కల్పించారు. సంప్రదాయ వంటల వండే బామ్మలకు సైతం స్పెషల్ ఎపిసోడ్‌లు చేయడంలో నిర్వాహకులను మెచ్చుకోవాలి. ఇక చెఫ్‌లు ఆరితేరిపోయి ఉంటారు కనుక చెప్పనే చెప్పక్కర్లేదు. అబ్బో! ఈ టైమ్‌లో ఏ ఛానల్‌పెట్టినా వంటలే వంటలు అందరికీ కన్నుల పంటలు అన్నట్టుగా ఉంటుంది. పాపం! యాంకర్లు కనీసం యావరేజ్ అనే మాట ఉపయోగించడానికి లేకపోవడంవల్ల ప్రతి వంటను సూపర్బ్ అనాల్సిందే! వెజ్-నాన్‌వెజ్ ఐటమ్‌లను ఓ స్పూనుడు లాగించేయాల్సిందే! ఇన్ని చానళ్ల పుణ్యమా అని చాలా రెసిపీలు ప్రతిరోజూ బయటపడి పోతున్నాయి.
ఇక ఇష్టముంటే ప్రేక్షకులు ఎత్తుకోవాల్సిందే! (చేయడానికి). ఈ మధ్యనే జీ తెలుగువారు వంటను యాంకర్ సంపూర్ణంగా (కుటుంబంతో కలిసి భోంచేసి) రుచి చూసే అవకాశం కల్పించారు.
వండి వార్చేవారిలో ఎక్కువగా టీవీ ప్రోగ్రాంలో పాల్గొనేవారు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు సాధారణ ప్రేక్షకులకు కూడ అవకాశాలు భారీగానే లభిస్తున్నాయి. ఇళ్లవద్ద షూటింగైతే యూనిట్‌ని భరించాల్సి వస్తుంది (ఎంతకాదన్నా) అంతాకూడా భారీగానే ఖర్చయినా అర్ధగంట సేపు ఆంధ్రదేశంలో అందరి ఇళ్లల్లో కాదు కళ్లల్లో గరిట తిప్పుతూ పడవచ్చు. పైగా టీవీల వారు వారి తాహతుకు తగ్గ బహుమతిని ప్యాక్‌చేసి మరీ చేతిలో పెట్టడం కొసమెరుపు.
వంట చేస్తున్నంత సేపూ పర్సనల్ కబుర్లు చెప్పాలి కనక కాస్త ప్రిపేర్ కావడం బెటర్. అమ్ముల ఇంట-కమ్మని వంటలో అయితే ప్రతి ఎపిసోడ్ వంటలను తెలుసుకోవడానికి తల్లీకూతుళ్లు చెప్పే భేతాళ కథలు ప్రేక్షకులు వినాల్సి వుంటుంది. చివరాఖరున ఐదుగురి ఎస్‌ఎమ్‌ఎస్ కాంటెస్టు విన్నర్స్‌కి రు.500 చొప్పున చెక్ ఇచ్చేవారు. అది కూడా ఈ మధ్య అటకెక్కింది. ఎన్ని ఛానల్స్‌లో వంటల ప్రోగ్రాంలు రన్ అవుతున్నా జీ తెలుగులో నడుస్తున్న మీ ఇంటి వంట మాత్రం సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు నడిచి రికార్డుకెక్కింది. పైగా ప్రతిరోజు ప్రేక్షకుడు రాసి పంపే సరికొత్త వంటకు బహుమతి కూడా క్రమంతప్పకుండా ఇస్తున్నారు.
‘మీరు కూడా ట్రైచేయండన్న’ యాంకర్ వంట ఎలా వున్నా కన్నుల విందుగా ప్రతిరోజూ ఛానల్స్‌లో వివిధ వంటలు (తెలిసినవి, తెలియనివి) చూస్తుంటే తింటే గారెలే తినాలి..వింటే భారతమే వినాలి అన్నట్టు ఉంటుంది. మొత్తానికి ఛానల్స్‌వారు అన్నపూర్ణ (ఆంధ్రప్రదేశ్)కు అవసరమైనన్ని వంటలు అందిస్తున్నారు. వంటల ప్రోగ్రాంలో ‘టిప్స్’ అందించడం కూడా అవసరమే ఎందుకంటే ప్రియమైన భోజనం కాస్త ఎక్కువైతే అజీర్తే కదా!
వచ్చేస్తున్నా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment