Monday, November 22, 2010

టీవీ యాంకర్లకు, రిపోర్టర్లకు కోచింగ్ క్లాసులు వుండవా.....?


టీవీ యాంకర్లకు ఇంటర్వ్యూలు ఎవరు...ఎలా కండక్ట్ చేస్తారో...ఏ బేసిస్ మీద సెలక్షన్స్ జరుగుతాయో తెలియదుగానీ వాళ్ల యాంకరింగ్ తీరు చూస్తుంటే మాత్రం ఆ సెలక్షన్స్‌లో ఏదో లోపం వుందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. నిలుచున్న తీరులోగానీ, హావభావాలలో గానీ, భావ ప్రకటనలోగానీ, భాషా విషయంలోగానీ ఏమాత్రం శ్రద్ధ, హుందాతనం, బాధ్యతా నిర్వహణ కనిపించవు. చేతులు తిప్పుతూ...బాడీ అంతా కదుపుతూ...ముద్దు ముద్దు మాటలతో వయ్యారాలు పోతుంది ఓ యాంకరమ్మ. ఒకరు వెకిలి నవ్వుతో, పిచ్చోడి గెటప్‌తో వుంటే, వళ్లంతా ఊగి తూగిపోగా, ముద్ద ముద్ద మాటలతో బోర్ కొట్టిస్టుంటాడు మరో యాంకరయ్య. ఒక్కరికి వత్తులు పలకవు. ‘ఎన్నో భావగీతాలు...రచించిన సీ దేవులపల్లి ల్ల క్రిష్నశాస్తిరిగారి వర్దంతి సందరబంగా ఈనాటి సినీ గీతాల కారియక్రమాన్ని ఆయనకు అంకితం చేస్తూ ప్రారంబిస్తున్నాం...’ అంటారు. చాలామందికి ‘ళ’, ‘ణ’ ఛస్తే పలకవు. శ,స,షలకు తేడా తెలవదు. ‘నటన అనేది అది ఒక ‘కల’. ఆ ‘కల’లో ఆరితేరిన నటి, వాని స్రీ, ఇకపోతే జయషుద షహజ నటి. ఆనాటి మేటి తారలు వీల్లంతా..’ ఇలా! ఇక రిపోర్టర్లయితే అనవసర పదాలతో విషయాన్ని సాగదీస్తూ కాలం వృధా చేయడమే కాక శిథిల భాషను ప్రయోగిస్తూ వుంటారు రిపోర్టింగ్ సమయంలో. ‘మరి...ఆ యొక్క... గుంటూరులో గోనెసంచీలో ఒక...పదిహేనూ..పదహారూ సంవత్సరాల వయసుండే అమ్మాయి శవం బయటపడింది. గోనెసంచీకి సంబంధించిన తాళ్లను విప్పి చూసిన ఆ యొక్క పోలీసలు ఆ శవాన్ని చూసి...మరి...ఆచ్చెర్యపోయారు ఇలా...! పద ప్రయోగంలోనూ ఒక పద్ధతి, సమయ సందర్భాలు వుండవు. ‘ఎన్నికల ప్రచారానికి...బయలుదేరిన ...అధికార పార్టీ ఎమ్.ఎల్.ఏ ఒకరిని...మరి...ఆ నియోజకవర్గం ప్రజలు చితకబాదారు. ‘చితకబాదారు’ పదం ఏ నేరస్థుడి గురించో చెబుతున్నప్పుడు వాడాల్సినది...‘దాడిచేసారు’ అంటే ఇక్కడ బాగుంటుంది. ఇంకా ‘ఆయొక్క ప్రమాదంలో మరణించిన పెంచలయ్య శవాన్ని ‘దర్శించడానికి’ ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు’ అంటారు...దర్శించడం ఏమిటి? ఆ మధ్య మహేశ్ అనే బాలుడు బోరు బావిలో పడితే అతన్ని రక్షించే పనిలో రెస్క్యూ టీం వుండగానే ‘మహేశ్‌యొక్క శవం ఇంకా రెండు అడుగుల లోతులో వున్నట్టుగా గుర్తించారు’ అని ‘శవం ’ అన్న మాటను ఒక్కసారి కాదు...పదే పదే ఆ రిపోర్టర్ వాడి వీక్షకులకు కోపం తెప్పించాడు ఆరోజు. ‘నేపథ్యం’ అనేది గ్రాంధికమైన...చాలా తక్కువగా వినిపించే ఒక బరువైన పదం. ‘చారిత్రక నేపథ్యం-రాజకీయ నేపథ్యం’ అని కొన్ని సందర్భాల్లో వాడే మాట.

ఇక న్యూస్ రిపోర్టర్లు రిపోర్టింగ్‌కి వెళ్లబోయేముందు ఇన్‌ఫర్మేషన్ గాదర్ చేసుకోవడానికి ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు అనేకం వున్నాయి. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాలు, విపత్తులవంటివి కాదు గానీ ఒక స్థలాన్ని, ఒక క్షేత్రాన్ని, ఒక సెలబ్రిటినీ, ఒక గడిచిన కాలాన్ని, చరిత్రను పరిచయం చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయ సేకరణను ముందుగా చేసుకుంటే ‘మరి..ఆయొక్క...అలా...అదేమాదిరి’ వంటి సాగతీతలు, తడుముకోవటాలు వుండకుండా ఘంటాపథంగా, ఖచ్చితంగా రిపోర్టింగ్ సాగిపోతుంది. చేస్తున్న వృత్తిపట్ల గౌరవం, బాధ్యత, అంకితభావం వున్న వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రేక్షకులను ఇన్‌వాల్వ్ చేస్తూ సాగే లైవ్ ప్రోగ్రామ్స్‌లో సొల్లు వాగుడు, అతివాగుడు, ‘మీకెవరైనా లవ్వర్ వున్నారాః’ వంటి అసభ్య ప్రేలాపనలు లేకుండా వుండాలంటే యాంకర్ చాలా షార్ప్‌గా, స్పాంటేనియస్‌గా, డిగ్నిఫైడ్‌గా యాంకరింగ్ చేయడానికి పైన చెప్పినవి పనికి వస్తాయి. ఇప్పుడు టీవచ చానళ్లు అప్రతిష్టపాలు కావడానికి, చులకనైపోవడానికి, అనేక విమర్శలను ఎదుర్కోవడానికి, కార్టూనిస్టులకు మంచి టాపిక్స్ అందివ్వడానికి కారణం చాలామటుకు యాంకర్ల తలతిక్క యాంకరింగు...రిపోర్టర్ల ముద్దముద్ద మొద్దు రిపోర్టింగే! కనుక చానళ్ల నిర్వాహకులతోపాటు స్వయంగా వీళ్లుకూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. లేకుంటే సమాజంలో యాంకర్లు అన్నా, రిపోర్టర్లు అన్నా జనానికి విశ్వాసం లేకుండా పోతుంది. రాబోయే కొత్తవాళ్లకు మార్గదర్శకత్వం వహించేవాళ్లు ఎవ్వరూ లేకుండా పోతారు. ‘పురుషులందరు పుణ్య పురుషులు...’ అన్నట్టు వేళ్లమీద లెక్కింపదగిన మంచి యాంకర్సర్స్, రిపోర్టర్స్...లేకపోలేదు. వాళ్లకు ఈ వ్యాసం వర్తించదని మనవి.