మరోచరిత్ర అనే ఆల్‌రౌండ్ తెలుగు ప్రేమకథా చిత్రాన్ని తిరిగి తెరకెక్కించడం ఓ సాహసం. కచ్చితంగా ప్రేక్షకులు ప్రతి విషయంలోనూ, పాత సినిమాతో పోల్చి చూసుకుంటారని తెలుసు....అటువంటప్పుడు దర్శకుడి బాధ్యత రెట్టింపవుతుంది. అందునా పాత సినిమాకు, రీమేక్‌కు నడుమ తరాల అంతరాలున్నపుడు, అభిరుచులు అనూహ్యంగా మారిపోయినపుడు మరింత జాగ్రత్తలు అవసరం. ఈ బాధ్యతలను, జాగ్రత్తలను గాలికి వదిలేసి సాముచేస్తే, అది సాహసం కాదు.. దుస్సాహసం అవుతుంది...
సినిమా జనానికి నిరాశే మిగులుతుంది. నిజానికి బాలచందర్ మరోచరిత్ర వచ్చి మూడు దశాబ్ధాలు దాటిపోవడంతో ప్రేక్షకులు దాని గురించి చాలా వరకు మర్చిపోవడం, ఇప్పటి తరం ప్రేక్షకులకు దానిపై అంతగా ఆసక్తి తక్కువగా వున్న కారణాల రీత్యా ఆ సినిమాను రీమేక్ చేయడం అన్నది పెద్ద సాహసమేమీ కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, అభిరుచులకు తగ్గట్లు కాస్త మార్చుకుంటే చాలు. చిత్రమేమిటంటే ఇప్పటి ఈ మరోచరిత్ర అప్పటి సినిమా దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం కాలేదు.. అసలు ప్రేమకథా చిత్రాలకు కావాల్సిన బేసిక్ ఫీల్‌ను కలుగచేయడంలో విఫలమైంది. అంటే గమ్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాను విదేశీ బ్యాక్‌గ్రౌండ్‌లో తీయాలనుకోవడం పెద్ద మైనస్. ఎందుకంటే కేవలం సిల్లీ తగాదాలను దృష్టిలో వుంచుకుని, పిల్లల ప్రేమలను పంతానికి తీసుకునే జనరేషన్ ఇప్పుడు విదేశాల్లో వుంటుందనుకోవడం ఎంతవరకు సమంజసం. దీనికితోడు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్‌లో, లేదా అదే యాక్సెంట్ తెలుగులో ప్రేమకథా డైలాగులు ప్రేక్షకుల గుండెలను తాకమంటే ఎలా సాధ్యపడుతుంది. పైగా హీరో, హీరోయిన్ ఇద్దరి మాడ్యులేషన్, సినిమాకు చాలా వరకు మైనస్ అయింది. దీనికి తోడు కీలకమైన సన్నివేశాలను పండించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. మొట్టమొదట హీరోతో హీరోయిన్ తాను అతగాడిని ప్రేమిస్తున్నాన్నంటూ చక్కటి డైలాగులు చెప్పే సన్నివేశం కానీ, చివరగా హీరో, హీరోయిన్లు ఆత్మహత్య చేసుకునే సన్నివేశాన్ని కానీ, దర్శకుడు రక్తికట్టించలేకపోయాడు. ఇక్కడ చిన్న ప్రస్తావన చేయకతప్పదు.. గుప్పెడుమనసు చిత్రం క్లయిమాక్స్‌లో కథానాయిక సరిత మేడమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే క్లయిమాక్స్ సన్నివేశాన్ని బాలచందర్ తీసిన తీరు ఎలా వుంటుందో తెలుసుకుంటే, ఇటువంటి సన్నివేశాన్ని ఎలా డీల్ చేయాలో అర్ధమవుతుంది.....
కొత్త అమ్మాయి అనిత ఫిజిక్ బాగుంటే బాగుండచ్చు కానీ..ఫేస్‌లో కొన్ని మైనస్ పాయింట్లు వున్నాయి. నిజానికి వరుణ్‌కన్నా ఆ అమ్మాయి నటనే బెటర్. వీరిద్దరి కన్నా శ్రద్ధాదాస్ ఫేస్‌లో ఫీలింగ్స్ బాగా పలికాయి.....
అప్రస్తుతమైనా పేర్కొనాల్సిన విషయమేమిటంటే, కథాంశం తక్కువైనా, గుండెతట్టేలా సన్నివేశాలు రూపొందిచిన ‘ఏమాయ చేసావె’ చిత్రాన్ని, నిడివిలో ఇంచుమించు అంతే కథాంశం వున్న ఈ ‘మరోచరిత్ర’ను పోల్చి చూసుకుంటే దర్శకత్వ ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. అదే సినిమాకు ఆత్మ.
No comments:
Post a Comment