Friday, December 17, 2010

చంద్రముఖి మళ్ళ వచ్చింది....కానీ ముగ్గురిలో పూనింది...



సీక్వెల్స్‌తో మెప్పించగలడం సాహసమైతే...రజనీకాంత్‌ వంటి నటుడు చేసిన పాత్రను మళ్ళీ మరొకరు చేయడం మరింత సాహసమే. వెంకటేష్‌ అటువంటి సాహసం చేసి కొంత మెప్పించగలిగాడు. పిల్లల్ని, పెద్దల్ని అలరించే పాత్రలు పోషించిన వెంకటేష్‌కు 25 ఏళ్ళ కెరీర్‌లో, ఛాలెంజ్‌గా తీసుకుని చేసిన చిత్రం నాగవల్లి. డాక్టర్‌గా, రాజుగా, అఘోరాగా మెప్పించాడు. చంద్రముఖి దర్శకుడు పి.వాసు నాగవల్లికీ దర్శకత్వం వహించారు. కన్నడలో ఆప్తమిత్ర, ఆప్తరక్షకగా సీక్వెల్‌ చేసిన ఆయన తెలుగులోనూ అదే ప్రయోగం చేశాడు. స్క్రీన్‌ప్లే చేయడంలో కాస్త గందరగోళపడ్డాడనే చెప్పాలి. డాక్టర్‌గా తను పరిష్కరిస్తానని వచ్చిన వెంకటేష్‌ పాత్రను మరిచి అర్థాంతరంగా ముగింపు ఇచ్చాడు. చంద్రముఖిని మనసులో చెరిపేసుకుని వస్తే నాగవల్లి అదుర్స్‌.
చంద్రముఖి పెయింటింగ్‌ తిరుపతిలో ఉన్న శంకరరావు దంపతుల (శరత్‌బాబు, ప్రభ)కు చేరుతుంది. వారికి గాయత్రి (కమలినీ), గౌరీ (రిచాగంగోపాధ్యారు) గీత (శ్రద్దాదాస్‌) కుమార్తెలు. శంకరరావు బావమరిది ధర్మవరపు సుబ్రహ్యణ్యంకు పూజ, హేమ (పూనమ్‌కౌర్‌, సుజిత) కుమార్తెలు. గాయత్రి మంచి డాన్సర్‌. నృత్యపోటీల్లో గెలుపొందినందుకు వందేళ్ళనాటి చంద్రముఖి చిత్రపటం ఆమెకు బహుమతి లభిస్తుంది. అది తెచ్చే క్రమంలో ఆమె ప్రియుడు చనిపోతాడు. దాంతో ఆమెకు పిచ్చెక్కుతుంది. ఈ విషయాన్ని దాచి మిగిలిన పిల్లలకి పెండ్లిచేయాలని శంకరరావు చూస్తాడు. పెండ్లిసమయానికి పెండ్లికుమారుడికి 30 అడుగుల పాము కన్పించడంతో పారిపోతాడు. దీంతో షాక్‌కు గురైన శంకరరావు దంపతులు సిద్దాంతిని పిలించగా...ఐదేళ్ళనాడు గంగ (జ్యోతిక) ఇంటిలో ఉన్న చంద్రముఖి మీ ఇంటికి వచ్చిందనీ, దీనివల్ల అరిష్టాలు జరుగుతున్నాయనీ వివరిస్తాడు.
ఈ సమస్యను పరిష్కరించే వ్యక్తి డా|| ఈశ్వర్‌ (రజనీకాంత్‌) శిష్యుడు డా|| విజరు (వెంకటేష్‌)అని చెప్పి అతన్ని పిలిపిస్తాడు. ఎప్పుడూ నవ్విస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలనుకునే మానసిక వైద్యనిపుణుడు విజరు. చంద్రముఖి ఇంటిలో ఎవర్ని ఆవహించింది? అనేది కనిపెట్టడానికి కృషిచేస్తాడు. ఆ క్రమంలో అతనికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వెంకటాపురం రాజా నాగభైరవ (వెంకటేష్‌) చంద్రముఖి (అనుష్క)ను ఏవిధంగా చంపిందీ తెలుస్తుంది. అయితే అతను తనలాగే ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. తన ప్రియుణ్ని, తనను కాల్చి చంపిన రాజా నాగభైరవపై చంద్రముఖి పగప్రతీకారంతో రగిలిపోతుంది. అందుకే దేహం పోయినా ఆత్మ చావలేదని సిద్ధాంతి చెప్పడంతో ఆ కోణంలో డాక్టర్‌ విజరు పరిశోధిస్తాడు. ఆ ఆత్మ శంకరరావు కుమార్తెల్లో ఒకరిని ఆవహిస్తుంది. ఆమె ఎవరు? ఆమెనుంచి చంద్రముఖి ఎలా విడిపోయింది? అన్నది మిగిలిన కథ.
డాక్టర్‌, రాజు, అఘోరా...అనే మూడు పాత్రల్లో వెంకటేష్‌ కనిపించారు. నాగవల్లి రాజుపై పగబూనుతుంది. అదే పోలికలతో ఉన్న డాక్టర్‌తో మాత్రం సాధారణంగా వ్యవహరిస్తుంది. తన పోలికలతోనే ఉండే అఘోరానూ వెంకటేష్‌ గుర్తించనట్టు ప్రవర్తించడం...వీక్షకుడు సులభంగా మార్కింగ్‌ చేస్తాడు. డాక్టర్‌ రోల్‌ రొటీన్‌గా సాగింది. నాగభెరవరాజాగా చేసిన నెగెటివ్‌ పాత్ర ప్రత్యేకమైంది. ఆ పాత్రకు నిండుతనాన్ని వెంకటేష్‌ తీసుకొచ్చాడు. విలనిజం ఉన్న ఆ పాత్రకు 'ఔర ఔర..' అంటూ కొత్త డైలాగ్‌ వినిపించినా, సౌండ్‌ ఎఫెక్ట్‌ తగ్గిందనే చెప్పొచ్చు. చంద్రిముఖిగా అనుష్క ఆహార్యం బాగున్నా...పరిధి పరిమితమైంది. కమలినీముఖర్జీ చేసిన రోల్‌ చిత్రానికి హైలైట్‌. మెంటల్‌షాక్‌ గురికాకముందు, ఆ తర్వాత ఆమె చేసిన నృత్యం ఆకట్టుకుంది. చంద్రముఖి ఆవహించిన రిచాగంగోపాధ్యాయ...నటి జ్యోతిక అంత చేయకపోయినా పర్వాలేదు. ధర్మవరపు పాత్ర వడివేలును పోలుంటుంది. డాక్టర్‌ అసిస్టెంట్‌గా బ్రహ్మానందం పెద్దగా ప్రాధాన్యత లేనిది. మిగిలిన పాత్రలు సోసోగా ఉన్నాయి.
పరుచూరి సంభాషణలు సాధారణంగా ఉన్నాయి. చంద్రముఖి సీక్వెల్‌గా నాగవల్లి తీశినా, మొదటి సినిమాలోని పోలికలే ఇందులో కనిపిస్తాయి. కథనం కొత్త మలుపులు తిరగలేదు. దాంతో ప్రతీ చోటా వీక్షకుడు చంద్రముఖిని పోల్చుకుంటాడు. చంద్రముఖి ఎవరిని, ఆవహించింది అన్న సస్పెన్స్‌ కోసమే రెండున్నరగంటల సినిమా. ప్రేక్షకుడ్ని తికమక పెట్టడానికి ఎక్కువమంది హీరోయిన్లను దర్శకుడు టేకప్‌ చేశాడు. చోటా.కె.నాయుడు విజువలైజేషన్‌, సౌండ్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్‌ ప్రత్యేక ఆకర్షణ. గురుకిరణ్‌ బాణీల్లో ఓంకారం అభియం, గిరగిరణి...నిన్ను చూసి తరిణి...ఆకట్టుకున్నాయి. 25ఏళ్ళ వెంకీ సినీ జీవితాన్ని ఉద్దేశించిన వినిపించిన 'అభిమానులు లేనిదో హీరోలు లేరురా.. కార్మికులు లేనిదే ఓనర్లు లేరురా..' పాట చక్కగా సరిపోయింది.
చంద్రముఖి నాగవల్లిగా మారిందా ! నాగవల్లి చంద్రముఖిగా మారిందా ! అనే సస్పెన్స్‌ విడమర్చడంలో కాస్తతికమకగా ఉంది. ఒకదానికొకటి సన్నివేశాలు జోడించడంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్త ముడివిప్పడంలో చూపించలేకపోయాడు. పతాకసన్నివేశంలో డాక్టర్‌ పాత్ర ప్రేక్షకుడిలా మిగిలిపోతుంది. 'నాగవల్లి'లో పాత్రలు మినహా కథంతా ఒకేలా ఉంటుంది.

No comments: