Wednesday, July 27, 2011

బాలీవుడ్‌కు అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్న టాలీవుడ్ భామలు!





టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన లేత రంగు సుందరాంగుల భామలు తక్కువనే చెప్పాలి. చాలా తక్కువ హీరోయిన్లు మాత్రమే తెలుగు సినీ రంగం నుంచి బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యారు. వాళ్లలో జయప్రద, శ్రీదేవిలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కానీ న్యూ ట్రెండ్ టాలీవుడ్ హీరోయిన్లు మాత్రం బాలీవుడ్‌లో అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు.

'మగధీర' చిత్రంతో టాలీవుడ్ బంపర్ ఆఫర్లు కొట్టేస్తూ టాప్ పొజిషన్‌కు చేరిన కాజల్ అగర్వాల్ అజయ్ దేవగన్‌తో కలిసి 'సింగం'లో నటించింది. ఇదే తరహాలో తమన్నా కూడా తెలుగులో హిట్ అయిన 'మర్యాదరామన్న' చిత్రం హిందీ రీమేక్‌లో నటించనున్నట్లు తెలిసింది. అందులో హీరోగా అజయ్‌దేవగన్‌ నటిస్తున్నాడు.

కాగా అసిన్‌, శ్రేయలతో బాలీవుడ్ హవా మొదలైందనిపించినా, హిందీ చిత్ర సీమలో రాణించే టాలీవుడ్ భామలు తక్కువనే చెప్పవచ్చు. ఈ క్రమంలో మొదట అసిన్‌ పరిస్థితి ఫరవాలేదనిపించింది. అక్కడ ఎవరికీ దక్కనిరీతలో ఏకంగా ఖాన్ త్రయంతో అసిన్‌ సినిమా ఛాన్సులు కొట్టేసింది.

అయితే త్రిష పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. త్రిష బాలీవుడ్‌లో నటించిన తొలిచిత్రం ‘కట్టామిఠా’ అనుకున్న రేంజ్‌లో ఆడకపోవడం ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాకపోవడంతో మళ్లీ దక్షిణాది చిత్రసీమపైనే త్రిష దృష్టిసారించింది.

కానీ ప్రియమణికి అనుకోకుండా ఇద్దరు పెద్ద దర్శకుల చేతుల మీదుగా విచిత్రంగా బాలీవుడ్‌ ప్రవేశం చేసింది. అందులో రామ్‌గోపాల్‌వర్మ తీసిన హిందీ రక్తచరిత్ర ఒకటి కాగా మరొకటి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రావణ్‌’. రెండు చిత్రాలూ భారీ ఫ్లాప్‌లను ఎదుర్కోవడంతో ప్రియమణికి బాలీవుడ్‌ అవకాశాలు దక్కలేదు.

ఇక పోకిరి హీరోయిన్ ఇలియానా ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కానీ ‘బొమ్మరిల్లు’ హాసిని జెనీలియా పరిస్థితి హిందీలో ఆశాజనకంగానే ఉంది.

తాజాగా హర్మాన్‌ బవేజాతో కలిసి ‘ఇట్స్‌ మై లైఫ్‌’ చిత్రంలో, జాన్‌ అబ్రహంతో కలిసి ‘ఫోర్స్‌’ అనే చిత్రాలలో నటిస్తోంది. రెండూ కూడా దక్షిణాది చిత్రాలకు రీమేక్‌లే. ఇట్స్‌ మై లైఫ్‌ తెలుగులో ‘బొమ్మరిల్లు’కు రీమేక్‌ అయితే ‘ఫోర్స్‌’ చిత్రం వెంకటేష్‌ నటించిన ‘ఘర్షణ’కు రీమేక్‌.

తెలుగులో అవకాశాలు అంతంతగా ఉన్న ఛార్మికి లేటెస్ట్‌గా ‘బుడ్డా’ చిత్రం హిందీలో మంచి లైఫ్‌ని ఇచ్చింది. ఇప్పుడు సరికొత్తగా మరో చిత్రం ‘జిల్లా ఘజియాబాద్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇంకేముంది.. టాలీవుడ్ హీరోయిన్లకు ఒకటి రెండు బాలీవుడ్ ఛాన్సులు దక్కినా, బాలీవుడ్‌లోనూ ఓ వెలుగు వెలిగే టాలీవుడ్ హీరోయిన్లు కరువైయ్యారనే చెప్పాలి. మరి మీరేమంటారు...!?

No comments: