Monday, July 25, 2011

మ్యూజిక్ డైరెక్టర్ ది సహజ మరణం కాదంటున్న పోస్టుమార్టం రిపోర్ట్





మహాసముద్రం. మ్యూజిక్ డైరెక్టర్ కావాలని తపనపడ్డ వ్యక్తి.. గమ్యం లాంటి సినిమాతో టాప్ గేర్లోకి వెళ్లాడు. వర్ధమాన సంగీత దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు దక్కిన తర్వాత...ఇక లైఫ్ లోనూ సెటిలవ్వాలని భావించాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునేందుకు రెండువైపులా అంగీకరించారు. కానీ.. అంతలోనే అనుకోని ఘటన. కళ్యాణ ఘడియలు సమీపిస్తున్న వేళ.. ఆ కుటుంబానికి చావువార్త వినాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?

అవార్డులే కాదు.. విమర్శకుల ప్రశంసలూ పొందిన చిత్రం... గమ్యం. ఈ సినిమా సంగీత దర్శకుడి గురించే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది. గమ్యంతో తనలోని ప్రతిభను టాలీవుడ్ కి చాటిచెప్పిన అనిల్.. వర్ధమాన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సంభవామి యుగేయుగే.., కళావర్ కింగ్.., హైదరాబాద్ నవాబ్.., lbw.., నిన్న నేడు రేపు..., చిత్రాల్లో సమకూర్చిన బాణీలతో తనదైన ముద్ర వేశారీయన. భవిష్యత్ ఆణిముత్యంగా ప్రముఖల ప్రశంసలూ దక్కాయి.

మూడు నెలల క్రితం మరణించిన యువసంగీత దర్శకుడు అనిల్ ది సహజమరణం కాదనీ, హత్య అనీ ఇప్పుడు తెలుస్తోంది. అనిల్ కుటుంబసభ్యులు ఆ అనుమానంతోనే ఫిర్యాదు చేయడంతో అనిల్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. తలపై తగిలిన గాయంతోనే అనిల్ మరణించాడని పోస్ట్ మార్టం నివేదిక తేల్చడంతో ఇప్పుడంతా షాక్ అయ్యారు. 'సంభవామి యుగే యుగే', 'గమ్యం', 'ఓ మై ఫ్రెండ్' (అండర్ ప్రొడక్షన్) వంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన అనిల్ ని ఎవరు హత్య చేసి ఉంటారన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అందరి చూపూ అతని ప్రియురాలు శాలిని వైపే మరలుతోంది. ఆమెతో అనిల్ కి నిశ్చితార్ధం కూడా జరిగింది. తన కాబోయే భర్త తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించాడంటూ అప్పట్లో శాలిని చెప్పింది. అయితే, ఇప్పుడు ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అంతా ఆమెనే అనుమానిస్తున్నారు. అనిల్ అనారోగ్యంతో వున్నట్టు ఎప్పుడూ తాము గుర్తించలేదని అతని స్నేహితులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఈ రోజు ప్రముఖ టీవీ చానెల్ ప్రత్యేకమైన స్టోరీ చేయడంతో టాలీవుడ్ లో ఇది సంచలనమైంది. దీనిపై రాష్ట్ర హోం శాఖ వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తుకి ఆదేశించింది. ఇంతకీ అనిల్ ది హత్యా? ఒకవేళ హత్య అయితే నిందితులెవరు? అన్నవి త్వరలో తేలతాయి.

No comments: