Friday, November 19, 2010

మణిరత్నం కొంపముంచిన "రావణ" సినిమా.....

స్టాక్ హోం సిడ్రోమ్ (అపహరిచిన వారిపట్ల ప్రేమాభిమానాన్ని వ్యక్తపరచడం) ఎన్నో అద్భుత దృశ్య కావ్యాల్ని రూపొందించి అశేష ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన దర్శక మణిరత్నుని ప్రస్తుత ప్రస్థానాన్ని పరికిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన విలన్ (హిందీలో రావణ్) ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఒకప్పుడు తన మాతృభాషలో తీసిన వౌనరాగం, ఘర్షణ, నాయకుడు, దళపతి, రోజా, బొంబాయి సినిమాలు దేశమంతటా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత బాలీవుడ్ ప్రస్థానంలో యువ, గురు, నేటి విలన్ ఇవన్నీ కంట్లో నలుసులే. సినిమా అనే నావకు దర్శకుడే కెప్టెన్. తన ఆలోచనలు, తీసే విధానం, ఎన్నుకున్న సాంకేతిక వర్గం తన కంట్రోల్‌లో వున్నంతవరకే తను అనుకున్న విధంగా తీయగలడు. ఎప్పుడైతే ఆర్టిస్టుల ఇమేజ్ చట్రంలో దర్శకుడు పడిపోతాడో అప్పుడు తను తీయాలనుకున్న ట్రాక్ తప్పుతాడు. మహాభారత కథ ఆధారంగా ఆ మధ్య తీసిన దళపతి సూపర్ డూపర్ హిట్ అయింది అంటే రజనీకాంత్, మమ్ముట్టిల ఇమేజ్, అద్భుతమైన ఇళయరాజా సంగీతం, సహజంగా కర్ణుడి పాత్రపై ఉండే సానుభూతి రజనీకాంత్ పాత్రలో బాగా ఎలివేట్ అయింది. సినిమాలో ఆత్మ లోపించకూడదు. ఆర్ధ్రత, సెంటిమెంట్, టేకింగ్‌లో నూతనత్వం, దృశ్య చిత్రీకరణ ఇవన్నిటికంటే కథలో నవ్యత టేకింగ్ విధానం ఇవన్నీ చాలా ముఖ్యం. విలన్ విషయానికొస్తే రామాయణ పాత్రల ఆధారంగా కధను అల్లుకున్నా ప్రేక్షకుల హృదయాలను అల్లుకోలేకపోయింది. ఈ సినిమా మొత్తం రెండుపాత్రలపైనే దర్శకుడు దృష్టి కేంద్రీకరించాడు. ఏ కధలోనైనా హీరో పాత్రపై లేకుంటే హీరోయిన్ పాత్రపై సానుభూతి రావాలి. అందుకు విరుద్ధంగా విలన్ హీరోయిన్‌ను ఎత్తుకెళ్లినా కూడా విలన్‌ను హైలెట్ చేసి చూపించడం, చివర్లో హీరోయిన్ స్టాక్‌హోం సిండ్రోమ్‌కు లోనై విలన్‌పట్ల ఆరాధన వ్యక్తపరచడం అనే విషయాలు సామాన్యుడిని అయోమయానికి గురి చేస్తాయి. ఎందుకంటే రామాయణంలో సీతమ్మ రావణునిపై ప్రేమ/అభిమానం వ్యక్తపరచడం ఎంత అసహజంగా వుంటుందో ఈ సినిమాలో ఆ విధమైన భావాలు వుండడం కూడా ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. మణిరత్నం సినిమాలో సంగీతానికి మంచి స్థానం ఉంటుంది. అలాంటిది ఈ సినిమానే కాకుండా ఈ మధ్య వచ్చిన సినిమాలో కూడా ఎఆర్‌రెహమాన్ నిరాశపరిచాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే సినిమాను కాపాడదు. మంచి పాటలు వున్నప్పుడే అది జనంలోకి చొచ్చుకెళ్తుంది. బాలీవుడ్‌లో సినిమా తీయలేడు అనే అపప్రదనుండి మణిరత్నం బయటకు రావాల్సి వుంది.

No comments: