Friday, November 19, 2010

దర్శకత్వం అంటే... మాటలు కాదు!



మాజీ ప్రథాని పి.వి.నరసింహారావుకి జంధ్యాల సినిమాలు ఎంతో ఇష్టం. ఈయన గొప్పతనం ఏమిటంటే అవసరంకోసం తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని ద్వంద్వార్ధాలు, బూతు సినిమాలనే హాస్యంగా అందించే ప్రయత్నం చేయలేదు. ఒక గోదావరి..ఒక జంధ్యాలలాగ తెలుగు జీవనంలో ఆయన సినిమా ఓ భాగం. పాత్రల సహజత్వం ఏమాత్రం కోల్పోకుండా తన మార్కు ముద్రని డైరక్షన్‌లో వేసిన ధన్యజీవి జంధ్యాల. డైరక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి ఓసారి అన్నారు. మంచి ప్రతిభావంతమైన దర్శకులకి హిట్లు, ఫ్లాపులు ఉండవని వారి చిత్రాలన్నీ దృశ్య కావ్యాలేనని, నిజంగా ఎంత గొప్పమాట.
నిర్మాతల అభిరుచి మేరకు..తమ మనుగడ కాపాడుకోవడం కోసం..పాపం ప్రతిభ ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో డైరక్టర్స్ కొందరు చెత్త సినిమాలకి సారధ్యం వహించవలసి వస్తుంది. వీరికి స్వేచ్ఛని ఇస్తే వీరినుండి కూడా దృశ్య కావ్యాలు ఆశించవచ్చు. ఈ తరంలో కూడా చక్కని చిత్రాలు వస్తున్నాయి అనడానికి ఆ నలుగురు, గమ్యం, బాణం, అందరి బంధువయ ఉదాహరణలుగా నిలుస్తాయి.

డైరెక్షన్ తలుచుకుంటే అందరూ చేయగలరు కానీ కొందరే తాము అనుకున్న సన్నివేశాన్ని ఆసక్తికరంగా ఆకర్షణీయంగా తెరకెక్కించగలరు. ఏదైనా సరే ఓ సీన్‌ని చక్కగా సెల్యులాయిడ్‌పై చూపించడం ద్వారానే దర్శకులు చాలావరకు సక్సెస్ అవుతారు. తెరకి ఎక్కించే సన్నివేశంపై ముందుగా దర్శకుడికి పూర్తిగా అవగాహన ఉండాలి. తన సృజనాత్మక పరిశీలనా శక్తితో పరిశీలించాలి. ఇది తెలిసినవారే సక్సెస్ అయ్యారు. ఇదంతా నిరంతర పరిశోధన. కె.బాలచందర్, కె.విశ్వనాధ్, మణిరత్నం, శంకర్ సినిమాల్లోని సన్నివేశాలు ఎనీటైమ్ ఫ్రెష్‌గా వుండడానికి కారణం అదే! ఒక సన్నివేశం అనుకున్నారంటే నాలుగైదు రోజులపాటు దానిపై పూర్తిగా హోంవర్క్ జరగాలి. పాత్రధారుల బాడీలాంగ్వేజ్‌నుండి భావోద్వేగాల వరకు పరిశీలించాలి. వారిని పూర్తిగా పాత్రలో లీనమైపోయినట్టు శిక్షణ ఇవ్వాలి. అందుకే మనకి ఓ ఆకలిరాజ్యం, ఓ సాగరసంగమం, ఓ నాయకుడు సినిమాలు వచ్చాయి. డైరక్టర్స్‌గా పుట్టడం కరెక్టు కాదు. నిరంతర పరిశీలనా శక్తి ద్వారా తయారుకావడం గొప్ప. ఎప్పుడో వచ్చిన ‘ఆకలిరాజ్యం’ ఇప్పటి తరానికి కూడా నచ్చితీరుతుంది. ఇందులో ప్రతిపాటా ప్రతీ సన్నివేశం మనల్ని ఆలోచింపచేస్తాయి. గుండెల్ని కదిలిస్తాయి. ఈ చిత్రంలో హీరో పాత్రకి కమలహాసన్ ప్రాణప్రతిష్ట చేసారు. వర్తమాన వ్యవస్థలోని భిన్న పరిస్థితులను తన చిత్రంలో సన్నివేశాలుగా చిత్రీకరించడంలో దర్శకుడు బాలచందర్ పూర్తిగా విజయం సాధించారు. ‘బ్రాండెడ్ డైరక్టర్స్ సినిమాలు విజయవంతం కావడం అంటే...వంద రోజులు సినిమాహాల్లో ఆడడం కాదు కనీసం నాలుగైదు జనరేషన్లు వరకు సినిమా గుర్తుండిపోవాలి. ఎంత బడ్జెట్ ఖర్చుపెట్టాం అనేది కాదు, సమస్య ప్రేక్షకులు తమ సినిమాల్లో సన్నివేశాల్ని ఎంతవరకు గుర్తుంచుకున్నారో కావాలి. అందుకే శంకరాభరణం, రోజా, అంతులేని కథ, భారతీయుడు సినిమాలు నిత్య నూతనాలుగా ఔత్సాహిక దర్శకులకి డిక్షనరీలుగా ఉన్నాయి. .....

No comments: