Friday, December 10, 2010

రవిబాబు "మనసారా" సినిమా రివ్యూ.....



హాలీవుడ్ పద్దతుల్లో  పేరున్న నటులతో థ్రిల్లర్ లను, కొత్త నటులతో ప్రేమకధలను రూపొందించే రవిబాబు 'అమరావతి' తరవాత కేరళ నేపద్యంలో నడిచే ప్రేమకధ 'మనసారా..'ను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. విక్రం, శ్రీదివ్య నటీనటులుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మూవింగ్ ఇమేజెస్ బ్యానర్ ఫై ప్రకాష్ బాబు కడియాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించగా పరుచూరి బ్రదర్స్ మాటలు రాసారు. గతంలో నచ్చావులే సినిమాకి సంగీతాన్ని అందించిన శేఖర్ చంద్ర 'మనసారా'కు కూడా స్వరాలను సమకూర్చగా, కేరళ అందాలను సుధాకర్ రెడ్డి కెమేరాతో బందించారు.  సినిమా మొదలుపెట్టిన దగ్గరనుండి  మీడియాకు దూరంగా ఉంటూ ప్రచారమే లేకుండా, కధమీద, తన బ్రాండ్ మీద ఉన్న నమ్మకంతోనే రవిబాబు మనసారా సినిమాను విడుదల చేసాడు. ఒక వైపు భయంకరమైన థ్రిల్లర్ సినిమాలను తీస్తూనే మరో వైపు  సున్నితమైన ప్రేమకధాలతో అలరించే రవిబాబు ఈ ప్రయత్నంలో మనసారా చేసిన ప్రేమకధతో ఎంత వరుకు విజయం సాదించాడో ఈ సమీక్షలో చూద్దాం.

కధ:

కేరళలో కలరియ పట్టు అనే యుద్ధవిద్యకు ఏంతో ప్రాముఖ్యత వుంది. కేరళలో ఆ విద్యకు సంబందించిన ఎన్నో విద్యాపీఠాలు ఉన్నాయి. ఆలాంటి పీఠాలలో ఒకటి రాజయపాలెం కలరి విద్యాపీఠo. కలారి విద్య అక్కడ నివసించేవారి జీవితాల్లో భాగం, ఎంతలా అంటే వారు ఎటువంటి సమస్యనైనా కలరి పోటి ద్వారానే తేల్చుకుంటారు. ఇక హైదరాబాద్ లో వున్న విక్రమ్(విక్రమ్) తండ్రికి(బ్యాంక్ ఉద్యోగి) ట్రాన్స్ ఫర్ అవటంతో రాజయపాలెం వస్తారు. అక్కడ అంజలిని(శ్రీదివ్య) చూసిన విక్రం ప్రేమలో పడతాడు. అంజలి రాజయపాలెంలో కలరి విద్య నేర్పించే ఓ గురువు కూతురు. ఆయనకు మొదటి భార్య చనిపోవటంతో చేసుకున్న రెండో భార్య అంజలిని చిత్రహింసలు పెడుతూ వుంటుంది. అంతేకాకుండా తనతమ్ముడికి అంజలి ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటుంది. అతను కూడా కలరి నిపుణుడే. అలా భాధలు పడుతున్న అంజలికి ఓదార్పుగా ఉంటాడు విక్రమ్. దాంతో విక్రమ్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది అంజలి. తరువాత అన్ని ప్రేమకదలవలె వీరి ప్రేమలో కూడా సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యకు పరిష్కారంగా కలారి పోటీని నిర్ణయిస్తారు రాజయపాలెం పెద్దలు. అలా ఓ కలరి నిపుణుడైన విలన్ ను అమాయక పిరికి హీరో ఏవిధంగా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కధ.

విశ్లేషణ:

సహజంగా ప్రేమ కధలంటే ఓ అమ్మాయి, అబ్బాయి, కలుసుకోవడం, ప్రేమించుకోవడం, తరువాత వారి ప్రేమను ఎవరైనా అడ్డుకుంటే వారిని ఎదిరించి ఒక్కటవటం, అంతే కాక ఒక్కో ప్రేమ కధకి ఒక్కో నేపధ్యం వుంటుంది. అలాగే మనసారా.. లో కేరళ యుద్దవిద్య కలారియపట్టును నేపధ్యంగా తీసుకున్నాడు రవిబాబు. కానీ కలరికి వున్న ప్రాముఖ్యతను, విశిష్టతను మాత్రం వివరించలేదు. దాంతో కలారి విద్యా కూడా రొటీన్ ఫైటింగ్ లా కనిపించింది. ఆ ఒక్క అంశం పక్కన పెడితే 'మనసారా...? ఓ పక్తు రొటీన్ ప్రేమ కధ. తొలిభాగం ప్రేమసన్నివేశాలతో, కేరళ అందాలతో హాయిగానే ఉన్నా మలిసగం బోరింగ్ డ్రామాతో, అనవసరపు మలుపులతో రొటీన్ క్లైమాక్స్ తో నిరాశ పరిచింది. సత్యానంద్ స్క్రీన్ ప్లే లో నవ్యత లేదు. పరుచూరి బ్రదర్స్ మాటలు కూడా ఆకట్టుకునే విధంగా లేవు. అంతే కాకుండా ఈ  సినిమా చాలా విభాగాలలో 'జయం' సినిమాను గుర్తుకుతెస్తూ వుంటుంది. హీరో గా పరిచయమైన విక్రమ్ కధకు సరిపడే విధంగా బానే వున్నాడు. కాకపోతే అన్ని రకాల భావాలను పలికించలేకపోయాడు. ముఖ్యం గా నవ్వితే అసలు బాగోలేదు. అంతే కాకుండా అతని ఫిజిక్ లో ఓ వైవిధ్యం వుంది. ఎత్తుగా కనిపించిన పొట్టి కాళ్ళుతో  కాస్త వింతగా కనిపించాడు. హీరోయిన్ గా పరిచయమైన శ్రీదివ్య చాలా బాగుంది. కేరళ కుట్టిలా బాగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో దివ్య టైమింగ్, ఎక్స్ ప్రేషన్స్ నీట్ గా ఉన్నాయి. వీరు కాకుండా సినిమాలో పేరున్న నటుడు భాను చందర్  మాత్రమే, ఆయన తన పాత్రమేర బాగానే నటించారు. మిగిలిన నటీనటులు పరవాలేదు అనిపించారు. శేఖర్ చంద్ర పాటలు కధలో కలిసిపోయి వినసొంపుగా ఉన్నాయి. మార్తాండ్.కే.వెంకటేష్ ఎడిటింగ్ చక్కగా ఉంది. సినిమాది కేరళ నేపద్యమైన, 60 శాతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ చేశారంట.. అంటే హైదరాబాదులోనే కేరళను చూపించి అబ్బుర పరిచారు ఆర్ట్ డైరెక్టర్ నారాయణ  రెడ్డి. నిర్మాతగా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తిగా ప్రకాష్ బాబు కడియాల ను మెచ్చుకోవచ్చు. ఇక కధ కధనాలను పక్కన పెడితే రవి బాబు తనదైన చిత్రీకరణతో మనసారా.. చిత్రాన్ని అందంగా మలిచాడు.

ప్లస్ పాయింట్స్ :

సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ , ఫస్ట్ హాఫ్ లో ఉన్న ప్రేమ సన్నివేశాలు ప్రేమికులను ఆకట్టుకుంటాయి. శేఖర్  చంద్ర సంగీతం, బ్యాక్ స్కోరు అదనపు ఆకర్షణ, ముఖ్యంగా 'నువ్విలా...", "పర్వాలేదు ... " పాటలు వినటానికే కాకుండా చూడటానికి కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

రొటీన్ కధ కధనాలు ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్స్. ఆ తరవాత అల్లరి సినిమా నుండి రవి బాబు సినిమా అంటే సహజంగా ఆశించే వినోదం పాళ్ళు ఈ సినిమాలో చాలావరుకు తగ్గాయి. హీరో అమ్మ నాన్న తో చేయించిన కామెడి ఆకట్టుకునేలా లేదు.

కొసమెరుపు:

కొత్తదనం కొరవడిన ఈ సినిమాకి ' మనసారా...' అనే మంచి టైటిల్ పెట్టి జస్టిఫికేషన్ లేకుండా చేసారు అని పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.

1 comment:

srinivasrjy said...

మరిన్ని బ్లాగు పొస్ట్ లకు, అన్ని టెలుగు పత్రికల హెడ్ లైన్స్ కు http://andhravani.in