Thursday, January 20, 2011

మిరపకారు కొంచెం ఘాటే !


కథ : సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరోలో రిషీ (రవితేజ) ఓ పోలీస్‌ ఆఫీసర్‌. కిట్టూ భారు (ప్రకాష్‌రాజ్‌) అంతర్జాతీయ మాఫియా లీడర్‌. బ్యాంకాక్‌ కేంద్రంగా తన కార్యకలాపాలు నడిపిస్తుంటాడు. పోలీసులకు సవాలుగా మారుతాడు. ఇతన్ని వల పన్ని పట్టాలన్నది ఇంటలిజెన్స్‌ పోలీస్‌ల లక్ష్యం. ముందు అతని కూతురు వైశాలి (దీక్షాసేథ్‌)ని తమ ఆధీనంలోకి తీసుకోని, ఆ తర్వాత కిట్టూభారు పని పట్టాలని పోలీసులు వ్యూహం పన్నుతారు. ఈ పని పూర్తిచేయడానికే స్పెషల్‌ ఆఫీసర్‌గా రిషీ హైదరాబాద్‌కు బయలుదేరుతాడు.
ఇక్కడ ఓ కాలేజీలో హిందీ టీచర్‌గా చేరుతాడు. వినమ్ర (రిచా గంగోపాధ్యాయ) అనే ఓ సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిని ప్రేమిస్తాడు. వీరి ప్రేమ చిగురించి, పాకాన పడేసమయానికి వైశాలి సీన్‌లోకి వస్తుంది. తప్పనిసరిగా ఆవిడకు రిషీ దగ్గరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కథ అనేక మలుపులు తిరిగి, క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. మనసారా ప్రేమించిన వినమ్రను పెళ్లి పీటల వరకూ రిషీ నడిపిస్తాడు. కానీ తాను మాత్రం వైశాలితో బ్యాంకాక్‌ వెళ్లిపోతాడు. ఎందుకు ! ఏంటి ! అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..!
మాస్‌మసాలా ఎంటర్‌టైన్‌...ఫార్ములాను బాగా ఒంటబట్టించుకున్న తెలుగు హీరో రవితేజ. ఆయన్నుంచి అభిమాని ఏం ఊహించుకొని థియేటర్‌కు వస్తాడో, తెరపై అదే కనబడుతుంది. ఆ విషయంలో దర్శకనిర్మాతలు నిరుత్సాహపర్చలేదు. రవితేజ తనదైన ఉల్టాపల్టా మ్యానరిజంతో దూసుకెళ్లాడు. ఎడ్డమంటే తెడ్డమనటం ఆయన స్టైల్‌. వంట రుచిగా కుదరాలంటే ఘాటైన మిరపకారు ఒక్కటే సరిపోదు.
సినిమా అనే వంట పండాలంటే...వినోదం, విషాదం రెండూ ఉండాలి. దానికి ప్రతీకలగా రిచా, దీక్షాసేథ్‌లను దర్శకుడు హరీష్‌శంకర్‌ ఎంచుకున్నాడు. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా ముదిరిపోకముందే జాగ్రత్తగా ముగింపు పలికాడు. అందం, అభినయం విషయంలో రిచా గంగోపాధ్యాయకు పూర్తి మార్కులు పడతాయి. పోగరైన అమ్మాయిగా దీక్షాసేథ్‌ సరిగ్గా సరిపోయింది.
కథ విషయానికొస్తే...మాములే. లాజిక్‌ అనేదాన్ని బుకింగ్‌ కౌంటర్‌ వద్దే వదిలేసి రావాలి. హీరో ఏం చేసినా మనకోసమే (ప్రేక్షకుడ్ని అలరించడం కోసమే) ! అన్న భావనతో ఆస్వాదించాలి. చారుకేశా (సునిల్‌), అటెండర్‌ అపాచీ (అలీ)...మొదలైన పాత్రల ద్వారా పండిన హాస్యం చిత్రానికి ప్రధాన బలం. దానికి తగ్గ సంభాషణలు కుదిరాయి. ఒక్కమాటలో చెప్పాలంటే...పూరి జగన్నాథ్‌ సినిమాలోలా...హీరో అర్థం కాకుండా మాట్లాడుతాడు, అర్థమయ్యేట్టు పనిచేస్తాడు !
శంకరన్నా (కోట శ్రీనివాసరావు) తనదైన మార్కు అభినయం చూపించాడు. సంగీత దర్శకుడు తమన్‌ ఇచ్చిన బాణీల్లో బీట్‌, సాహిత్యాన్ని మింగేసింది. వినడానికి ఒకపాట బాగున్నా, గుర్తుంచుకోవడం కష్టమే ! సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ యావరేజ్‌. ఫైటింగ్‌ సీన్స్‌ పూర్తి సినిమాటిక్‌గా ఉన్నాయి. ఎన్ని వందల మంది వచ్చినా ఒంటి చేత్తే మట్టిగరిపించే అసలు సిసలు సినీ హీరో మరి !

No comments: