Wednesday, March 23, 2011

భూతు కూడా మన తెలుగు సినిమాలో ఒక పాత్ర.....సిగ్గు లేకుండా పలుకుతున్న సినిమా తారలు..





‘ఓయ్..నా పక్కలోకి వస్తావా...?’
‘ముడ్డిమీద తంతాను’
‘దాంతో పడుకుంటే నీకేంటి?!’
‘దూల తీరిందా’-ఇవన్నీ మన ఇంట్లో పిల్లలు మాట్లాడితే వెంటనే నాలుగు తగిలిస్తాం.
ఇదేమాట థియేటర్లో హీరో విలన్‌తో అంటే అది హీరోయిజం.





సిగ్గు విడిచి కొన్ని నిజాలు మాట్లాడుకుంటే మనసు పరచి కొన్ని తప్పుల్ని ఒప్పుకుంటే ఓ వాస్తవాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ఈరోజు తెలుగు సినిమాల్లో బూతు రాజ్యమేలుతోంది.
‘ఏంట్రా నీయబ్బ...’ అన్నవాళ్లే మనకు హీరోలు...హీరోయిన్లు...
‘జఫ్ఫా’ అని ఓ తెలియని పదం వాడేస్తే...అదే కామెడీ అని నవ్వుకోవడాలు. అలాంటి నటుడికి పద్మశ్రీ కట్టబెట్టడాలు.
‘నేనెంత ఎదవనో నాకే తెలీదు...’ అని అంటే రికార్డు బ్రేకులూ...బాక్సాఫీసు హిట్టులు. థియేటర్లో జనం చప్పట్లు. అలాంటి సినిమాకే అవార్డులు.
ఏంటీ గోల? ఎటుపోతున్నాం మనం?!



‘ఖలేజా‘ సినిమా వచ్చింది. అందులో మహేష్‌బాబు నోరువిప్పితే చాలు...‘్థ...దీనెమ్మ జీవితం’ అంటుంటాడు. ఈ పదంలో ఓ బండ బూతు దాగుందని పలికిన ప్రిన్స్‌కీ...పలికించిన త్రివిక్రమ్‌కి తెలీదు అనుకోవడం మన బుద్ధి తక్కువతనం. వెతికితే ఖలేజాలో ఇలాంటి బూతులు బోలెడుంటాయి. విని తట్టుకునే ఖలేజా మనకుండాలంతే!....


‘డాన్‌శీను’ అనే మరో సినిమాలో ఓ సన్నివేశంలో అలీ-‘సరిగ్గా కింద పెట్టు’ అంటాడు. ఏంటో అనుకునేరు-అది సంతకం. ఏమైనా అడిగితే-ఇదో రకమైన వినోదం అంటారు. తమ పదాల్లో దమ్ములేదని...అందుకే ఈ దారి ఎంచుకున్నామనే నిజం మాత్రం చెప్పరు. ‘నేనింతే’ అనే సినిమాలో నాయికను విలన్ ఎప్పుడూ తినేసాలాచూస్తాడు. ‘నా పక్కలో ఎప్పుడు పడుకుంటావ్’ అని వీలున్నప్పుడల్లా అడుగుతాడు. ఈ డైలాగులు రాసిన పూరీ జగన్నాధ్‌కి మాటల రచయితగా నంది అవార్డు ఇచ్చి సత్కరించారు. అందులో ‘పైసా సంపాదించని ఏ ఎదవకీ ప్రేమించే అర్హత లేద’నే విషయం బాగానే చెప్పారు. కానీ ఇలాంటి మోటు మాటల సంగతేంటో?! సెన్సార్ వాళ్ల చిత్తశుద్ధిమీద కూడా అనుమానం వేస్తోంది. ఒకప్పుడు ‘శోభనం’ అనే పదం పలకడానికే అభ్యంతరం చెప్పిన సెన్సార్..ఇప్పుడు అవే సన్నివేశాల్ని చూపిస్తున్నప్పుడు అర్ధంలేని పదాల్ని వాడేస్తున్నప్పుడు కత్తెరకు ఎందుకు పనిచెప్పడంలేదో అర్ధం కాదు. ఎల్‌బిడబ్ల్యు అనే సినిమాలో ‘ముడ్డిమీద కొడతా’ అంటూ ఓ అమ్మాయిచేత పలికించారు. ఆమెకు చదువులేదా? అంటే అదేం కాదు. శుభ్రంగా చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటోంది. అదొక్కడే కాదు- ‘నీయబ్బ’ అనే మాట ఇప్పుడు చాలా సహజమైపోయింది. అదేం బూతు కానట్టు యథేచ్చగా వాడేస్తున్నారు.


‘పోకిరి’, ‘ఇడియట్’ ‘రాస్కెల్’,‘మూర్ఖుడు’ ఇలా మన భాష ఎదిగీ ఎదిగీ ‘పోరంబోకు’ వరకూ వెళ్లింది. ప్లీజ్...ఈ తిట్ల ప్రస్థానం అక్కడితో ఆపేయండి. లేదంటే అమ్మమీదో నాన్నమీదో తిట్టుకుంటూ ఆ పదాల్నే పేరుగా పెట్టుకునే దౌర్భాగ్యపు స్థితి వరకు తెలుగు సినిమాని తీసుకెళ్లకండి..అంటూ మన సినిమా రూపకర్తల్ని మొరపెట్టుకోవడం మినహా చేయగలిగిందేం లేదు.


ప్రతి విషయాన్నీ రంధ్రానే్వషణ చేయక్కర్లేదు. కోడి గుడ్డుమీద ఈకలు పీకవలసిన అవసరమూ లేదు. కానీ చెదలు పడుతున్నప్పుడు..చెడిపోతున్నది మన భాషే అయినప్పుడు చేతులు కట్టుకుని కూర్చుని వినోదం చూడ్డం నేరాతి నేరం. తెలుగు సినిమాల్లో అడ్డమైన పదాలు వాడినంత మాత్రాన అదే భాషగా చెలామణి అయిపోతుందా? అని మీరడగొచ్చు. తెలుగుసినిమాల మీద, అందులోను ఇప్పుడు పుంఖానుపుంఖానుగా రాసి పడేస్తున్న రచయితల మీద మీకున్న అభిమానాన్ని మేం అర్ధం చేసుకోగలం. కానీ పింగళి-‘వేయండి వీరతాళ్లు’ అన్నప్పుడు...‘అరె...కొత్త పదం వచ్చిందే’ అంటూ మురిసిపోయి, వెంటనే వాడుకలో తెచ్చేసుకున్న విషయం మర్చిపోయారా?! బాపూ సినిమాలో రమణ ‘ఆమ్యామ్యా’ అనే పదం సృష్టిస్తే లంచానికి ప్రతిరూపంలా ఇప్పటికీ మనం వాడుకోవడం లేదూ. వీటిని ఆదర్శంగా తీసుకుని రేపు ‘జఫ్ఫా రే జఫడా...’ అనే తింగరి పదాన్నో, ‘కాట్ర కచోడి’ అనే అర్ధం లేని తింగరి ప్రయోగాన్నో తెలుగు భాషలో చేర్చేస్తారేమోనని భయం...అంతే!



1 comment:

Anonymous said...

there is nothing wrong in it. The characteristic of language is to includes words day by day.

you cant stop them using those words if people liked those words

and also you cant make people to use some words which they dont like.

So, best thing is just follow the society.