అందుకే అన్నారు పెద్దలు "కొండ నాలుకీ తాడేస్తే ఉన్న నాలుక ఉడింది అని.....నేడు ఆడపిల్లకి గ్లామర్ కావాలి అని అబ్బాయి అనుకుంటే, డాలర్ల భర్తే రావాలని ఆడపిల్ల ఆరాట పడ్తోంది. నేడు అమ్మాయిలు చదవుల్లో, ఉద్యోగాల్లో ఫాస్ట్‌గా ఉండటంతో పాటు పెళ్లికి ఆడపిల్లయే కరువైంది. పాతికలోపు అబ్బాయిని చూసి ‘‘అబ్బే! ఇంకా చిన్నవాడు, జాబ్‌లో స్థిరపడలేదు’’ అని మెటికలు విరుస్తున్నారు. పాతిక దాటిన అబ్బాయిని ‘‘అబ్బే! కారు, స్వంత ఇల్లు లేవు. పైగా రిటైరైన అమ్మా, నాన్నలు కొడుకు దగ్గరే ఉంటారుట. మా పిల్లేం సుఖపడుతుంది. అదే ఫారిన్ కుర్రాడైతే మా అమ్మాయి అక్కడికెళ్లి పోతుంది. కాబట్టి అత్తమామల పోరుండదు’’ అని పిల్ల తల్లిదండ్రులు నిర్ణయించేస్తున్నారు. ఆడపిల్లకి డాలర్ భర్త కావాలి. అన్నిట్లో విదేశీ వస్తువుల్లాగానే భర్తకూడా విదేశాల్లో వాడైతే బాగుండు అని అనుకోటం నేటి మన దౌర్భాగ్యం. అక్కడ వరుడి స్థితిగతులెలా ఉన్నాయా తెలీదు. ఏవారం చివర ఉద్యోగం ఊడ్తుందో తెలీదు. కానీ ఫారిన్ భర్త, ఫారిన్ అల్లడు అన్న మాటలు విన్పడ్తే చాలు జన్మ ధన్యం అనుకునే మనుషులున్న కాలం ఇది...
మన దేశంలో అత్తమామ, భర్త చిన్నమాటంటే పడక తాడెత్తున లేచే తరుణి, విదేశాల్లో భర్తల చేతిలో చిత్ర హింసలు పడ్తున్న పడతుల గూర్చి వింటే మన దేశంలో విడాకుల సంఖ్య కూడా బానే తగ్గిపోతుంది మరి. ఎంతమంది చదువుకున్న యువకులు అలోలక్ష్మణా అంటూ విదేశాల్నించి ఏడ్పుమొహాల్తో అమ్మా నాన్నల దగ్గరికి పరుగెత్తుకొస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి చాలు. మన ఇల్లు, మన రాష్ట్రం, మన దేశం అనే భావం రోజు రోజుకీ తరిగిపోవటం శోచనీయం కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయతకాక డబ్బు సంచులు తేవాలి అని అతను, డబ్బు కుమ్మరించాలని, ఒంటినిండా పుత్తడి కావాలని, ఆమె ఆశించటం నేటి వైవాహిక వ్యాపార కిటికుగా మారింది. ఒక సర్వే ప్రకారం పంజాబీ పడతులు చాలా ధైర్య స్థైర్యాల్తో విదేశాల్లో బాధల్ని ఎలాగో ఎదుర్కొని గట్టెక్కగలుగుతున్నారుట. వారు చాలా బోల్డ్‌గా కెనడా, అమెరికాలో భర్తలు వేధిస్తే ఎంచక్కా వదిలేస్తున్నారు. హాయిగా భారతదేశానికొచ్చేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. లేదా ఆ విదేశాల్లోనే ఉండి ఎంచక్కా తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే కేరళ అమ్మాయిలు కూడా శభాష్ అన్పించుకుని ధైర్య, సాహసాల్తో జీవితం గడుపుతున్నారు. కానీ రాజస్థాన్, యు.పి. అబలలు మాత్రం కుడితిలో పడ్డ ఎలుకల్లా గిలగిల లాడుతున్నారుట.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో లక్షల డాలర్లు సంపాదిస్తారని మనం భ్రమిస్తాం. కానీ 60, 70 వేల డాలర్ల ఏడాది ఆదాయం అంటే నమ్మం కదూ? ఆ కష్టం ఏదో మన దేశంలోనే పడ్తే ఎంతో బాగుంటుంది. కానీ ఉహూ... ఒళ్ళు వంగదు. మనసు నిలవదు. అందుకే అమ్మాయి కోర్కెలు ఆకాశానికెళ్తుంటే, అబ్బాయి అటకెక్కి కూచునే దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. ఇక్కడ్నించి వెళ్ళి ఆడపిల్ల అక్కడ ఏ షాపులోనో, బేబీ సిట్టర్‌గానో పని చేస్తూ డాలర్లు సంపాదిస్తుంది మరి భర్త ప్రొద్దుటే ఆఫీసుకెళ్ళగానే. అందుకే పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీరు తాగటం మేలు. బాల్యం నుంచీ విదేశాలపై మోజు పెంచే కబుర్లని అమ్మానాన్నలు చెప్పకూడదు. మనదేశ ఔన్నత్యం, ఇక్కడి ప్రేమ ఆప్యాయతల్నే బోధిస్తుంటే విదేశీ మోజు, అక్కడ కెళ్ళాలనే తపన, యావ తగ్గుతాయేమో చూడాలి మరి.
మీ మీ అబిప్రాయాలు మాతో పంచుకోండి...చాట్ బాక్స్ కోతగా పెట్టాం....
1 comment:
its very true..
Post a Comment