Tuesday, December 7, 2010

స్త్రీ శిల్పులు మువ్వురిలో ఒకరు మహా నటి సావిత్రి.....



సావిత్రిని, ఆమె పోషించిన పాత్రలను మరచిపోవడం ఆయా సినిమాలను చూసిన ప్రేక్షకుల తరంకాదు. పాత్రలో ఆమె ఒదిగిపోయినట్లు మరెవ్వరూ ఒదిగిపోలేరు అందుకే నటీ శిరోమణి అయింది. అందుకే శ్రీశ్రీ తన దృష్టిలో సినీరంగంలో ముగ్గురు స్త్రీ శిల్పులు వున్నారన్నారు. రాయిమీద ఉలితో కొడుతూ అందమైన శిల్పాలు శిల్పి సృష్టిస్తాడు. పాత్రను అర్థం చేసుకుని ఓరచూపుతో, కనుబొమ ముడితో, పెదవి చిట్లింపుతో, చిరునవ్వుతో, తల విదిలింపుతో, వేలు కదలించడంలో ఎలాటి క్లిష్టమైన భావాన్నైనా ప్రదర్శించగలరు ఆ ముగ్గురు స్త్రీ శిల్పులు- అన్నారు శ్రీశ్రీ. ఆ ముగ్గురూ తెలుగు వారే అని ఊరించారాయన. వారే జి. వరలక్ష్మి, భానుమతి, సావిత్రి అన్నారాయన.
రంగస్థల నటిగా పేరు తెచ్చుకున్న సావిత్రిని సినీనటిని చేయాలని ఆమె పెదనాన్న గట్టి ప్రయత్నాలు చేస్తే అందులో చాలమటుకు దెబ్బతింటే, సినిమా నటిగా పనికిరాదని కొందరు అంటే, వెనక్కి వెళ్ళి, నిరాశ పడకుండా మళ్ళీ వచ్చి, ప్రయత్నాలు చేస్తేనే సావిత్రిని సక్సెస్‌ క్రమ క్రమంగా వరించింది. 'మిస్సమ్మ' చిత్రంలో మొదట ఫిక్సయిన భానుమతి ఆ పాత్రను మిస్‌ చేసుకుంటే అది సావిత్రికి లభించడం, ఆ సినిమా చూసాక నేను మిస్‌ చేసుకున్నా, ఒక మంచి నటికి చక్కని అవకాశం లభించిందని భానుమతి అన్నారంటే అది ఆమె గొప్పదనమే కాదు సావిత్రి నటనకు ఆమె యిచ్చిన గౌరవం కూడా.
తెలుగు, తమిళ భాషల్లో సమానంగా పేరు తెచ్చుకున్న సావిత్రికి ఇతర భాషా చిత్రాల్లోనూ మంచిపేరు లభించింది. నిర్మాతగా, దర్శకురాలుగానూ రాణించింది. ఒళ్ళు పెరిగినా, పెరిగిన ఆ ఒళ్ళుని కాకుండా ఆమె హావభావాలను చూడటానికే అభిమానులు మొగ్గు చూపేవారు. అందుకే సావిత్రి ఎప్పటికీ గొప్ప నటీమణ. మరపురాని నటి సావిత్రి జయంతి డిసెంబర్‌ 6.

No comments: