Wednesday, January 5, 2011

మళ్లీ వైయస్ జగన్ ఢిల్లీ దీక్షకు పోటీగా చంద్రబాబు ధర్నా

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పోటీకి దిగుతున్నారు. రైతు సమస్యలపై, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై ఈ నెల 11వ తేదీన వైయస్ జగన్ ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష చేపడతానని ప్రకటించారు. అందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు.

దీంతో దానికి ముందే చంద్రబాబు కార్యరంగంలోకి దిగుతున్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీన్ని అఖిల పక్ష ధర్నాగా తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఈ మేరకు బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం ప్రకటించింది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై సంతకాల సేకరణ జరపాలని కూడా నిర్ణయించినట్లు తెలిపింది.

కాగా, రైతు సమస్యలపై గత నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు వైయస్ జగన్ విజయవాడలో 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించగానే తాను 17వ తేదీన నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తానని చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఈ విషయంలో తామంటే తాము ముందు నిర్ణయం తీసుకున్నామని ఇరు వర్గాలు పోటీ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్ష చేయగా, జగన్ 48 గంటల దీక్ష చేశారు. తాను ఈ నెల 11వ తేదీ ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష చేస్తానని జగన్ రెండు రోజుల క్రితం విశాఖపట్నం జిల్లా ఓదార్పు యాత్రలో ప్రకటించారు.

No comments: